KCR Kasani:బీఆర్ఎస్‌లో చేరిన కాసాని.. సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్..

  • IndiaGlitz, [Friday,November 03 2023]

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎఎస్‌లో చేరారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తనకు పాతమిత్రుడైన కాసాని ఎప్పుడో పార్టీలోకి రావాల్సిందని కాకపోతే కాస్త ఆలస్యమైందన్నారు. కాసానికి సముచితం స్థానం కల్పిస్తామని.. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు ఆయనను పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వపరంగా ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. ముదిరాజ్ సామాజికి వర్గానికి చెందిన ఈటల రాజేందర్ వంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్ద నాయకులైన కాసాని పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. రాజకీయంగానూ ముదిరాజ్ సామాజిక వర్గం ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు విముఖత చూపడంతో తీవ్ర ఆవేదనకు గురైన కాసాని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్‌ కోరుతున్నారని.. లోకేష్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని వాపోయారు. ఎన్నికల్లో బీఎస్పీ, జనసేన లాంటి చిన్న పార్టీలు కూడా పోటీ చేస్తున్నా.. 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పోటీకి దూరం కావడం తనను బాధించిందని ఆయన తెలిపారు.