YS Jagan: వర్షాల కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు
- IndiaGlitz, [Tuesday,November 21 2023]
ఏపీ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన రద్దైంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల వల్ల సీఎం హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతాయని.. బహిరంగ సభకు వచ్చే ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే కారణంలోనే పర్యటనను వాయిదా వేసిటన్లు తెలిపింది. త్వరలోనే ఈ పర్యటనను రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది.
ఈ పర్యటనలో భాగంగా వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. రూ.94 కోట్లతో పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంతేకాదు ఓఎన్‌జీసీ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు కూడా ఇక్కడి నుంచే నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో అధికారంలోకి రాగానే పులికాట్ పూడిక తీయిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు నగరంతో పాటు రాపూరు, కలువాయి, చేజర్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతో తీర ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.