CM Jagan:సీఎం జగన్ లండన్ పర్యటన.. ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కలకలం

  • IndiaGlitz, [Saturday,May 18 2024]

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్న సమయంలో తీవ్ర కలకలం రేగింది. లండన్ వెళ్లేందుకు జగన్ తన కుటుంబంతో గన్నవరం ఎయిర్‌పోర్టు వచ్చిన సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అతడిని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఆర్‌ఐ డాక్టర్‌ తుళ్లూరు లోకేష్ కుమార్‌‌గా గుర్తించారు.

ఆయన అమెరికాలోని వాషింగ్టన్‌లో వైద్యుడుగా పనిచేస్తున్నారట. అంతేకాకుండా అమెరికా సిటిజన్‌షిప్‌ కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తే జగన్ విదేశీ టూర్‌పై వేరే వాళ్లతో చాటింగ్ చేసిన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్‌ కుమార్‌కు సంబంధం ఏంటి..? జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

విచారణ సమయంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. తనకు చాతీలో నొప్పి వస్తుందని పడిపోవడంతో లోకేష్‌ను హుటాహటిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పోలీసులు కిడ్నాప్ చేసి, కొట్టి, బెదిరించి ఏదో ఒకటి ఒప్పుకోమని లేకపోతే.. ఏదైనా చేయగలమని ఒక 20మంది పోలీసులు వచ్చారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్కడికి వచ్చిన పోలీసులకు బాడ్జ్‌లు, పేర్లు లేవని.. తన అమెరికా ఐఫోన్‌ తీసుకుని మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు చదివారని, మెయిల్స్‌‌లో ఫోటోలు తీసుకున్నట్లు ఆరోపించారు.

కాగా ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపిన జగన్.. కుటుంబంతో సరదాగా గడిపేందుకు లండన్ వెళ్లారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరారు. తొలుత లండన్ వెళ్లి అక్కడి నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌‌కు వెళ్లనున్నారు. జూన్ 1వ తేదీ తిరిగి రాష్ట్రానికి రానున్నారు. అంతకుముందు విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టుతో అనుమతి కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో సీఎం జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు సెండాఫ్ ఇచ్చారు.