CM Jagan:పెత్తందారుల కుట్రలను ఎదుర్కోవాలి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం జగన్..
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా.. ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు. సామాజిక చైతన్యాల వాడగా ఇక బెజవాడ విరాజిల్లుతుందన్నారు. స్వాతంత్ర్య సమర చరిత్ర ఉన్న స్వరాజ్య మైదానంలో 75వ రిప్లబిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. పేదలు, మహిళలు, ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం ఈ విగ్రహం స్ఫూర్తి నిస్తుందన్నారు.
ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహమని.. మరణం లేని మహానేత అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంటరానితనాన్ని స్వయంగా అనుభవించి పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చెప్పుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం ఇంకా ఉందని గుర్తుచేశారు. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే.. కానీ ఈ పెత్తందారుల పత్రిక ఒకటి తెలుగులోనే చదవుకోవాలని అంబేద్కర్ చెప్పారని రాశారని విమర్శించారు. చరిత్రను వక్రీకరించే వాళ్లు ఈ స్థాయికి దిగజారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని బాధ వేస్తుందన్నారు.
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అంబేద్కర్ భావజాలం ఈ పవన్, చంద్రబాబులకు అస్సలు నచ్చదని విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ప్రేమ లేదని మండిపడ్డారు. అదే మన ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా అడుగులు పడ్డాయని వివరించారు. చంద్రబాబు కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని.. అందుకు ఆయనకు మనసు కూడా రాలేదని ఫైర్ అయ్యారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పేదలకు ఇచ్చామన్నారు. ఈ ఐదేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. అలాగే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేరుగా పేదలకు అందించామన్నారు. రాష్ట్రాన్ని దోచుకునే మనస్తత్వం ఉన్న పెత్తందారీ నేతలకు ఏనాడైనా మనసు వచ్చిందా? ఏ రోజైనా బటన్ నొక్కాలని అనిపించిందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
కాగా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట 125 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహం ప్రభుత్వం నిర్మించింది. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఇది నిలవనుంది. 18.81 ఎకరాల్లో స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనంతో నిండి ఉంది. స్మృతివనంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతో పాటు ఆయన జీవిత విశేషాలు, శిల్పాలు, కన్వెన్షన్ హాల్, యాంఫీ థియేటర్, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.
లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా సిద్ధం చేశారు. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించగా.. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు కాగతా మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ఇందుకు మొత్తం రూ.400కోట్లు ఖర్చు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout