CM Jagan:అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల శంఖారావం పూరించిన జగన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస వద్ద ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షాల పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి తాను అభిమన్యుడుని కాదని అర్జునుడిని అని తెలిపారు. ఈ అర్జునిడికి దేవుడి దయ, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అండ ఉంది. మీరందరి అండదండలు ఉన్నంతకాలం ఎవరికీ భయపడేది లేదన్నారు. ఒకవైపు పాండవ సైన్యం .. మరోవైపు కౌరవ సైన్యం ఉందని.. తనకు శ్రీకృష్ణుడి లాంటి ప్రజలు, కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ యుద్ధంలో 175 సీట్లలోనూ మనమే గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరో పాతికేళ్లు మన జైత్రయాత్ర కొనసాగాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలోని 99శాతం హామీలను నెరవేర్చామని.. ఈ ఐదేళ్లలో మనం చేసిన మంచిని ప్రజలకు ప్రతి కార్యకర్త వివరించాలని తెలిపారు. ఎంతో రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడితో పాటు మిగతా వారి సహాయం తీసుకుంటున్నారని విమర్శించారు. గతంలో వచ్చిన 23 సీట్లు కూడా ఈసారి టీడీపీకి రావని వెల్లడించారు.
మరో 70-75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని.. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య.. మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎక్కడా వివక్ష లేకుండా ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా గడప గడపకు అందించిన ప్రభుత్వం తమదన్నారు. ఇందుకోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి విజయవంతమయ్యామని చెప్పుకొచ్చారు.
రైతలన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ... విలేజ్ క్లినిక్.. ఫ్యామిలీ డాక్టర్.. ఆరోగ్య సురక్ష అందించామన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామన్నారు. అలాగే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్యాబ్స్ ఇచ్చామని పేర్కొన్నారు. ఇలా ఒక్కటేంటి అన్నింటిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఈ మార్పులు కనిపిస్తున్నాయని వివరించారు. ప్రజలందరూ ఇది గమనించాలని కోరారు. చేసిన మంచిని, అభివృద్ధిని నమ్ముకునే మీ బిడ్డ.. ఎన్నికలకు వెళ్తున్నాడని.. ప్రజలందరూ ఆశీర్వదించాలని ప్రజలకు జగన్ విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout