YS Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. వివాదాస్పద నేతలకు చెక్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు దూకుడుగా ప్రవరిస్తూనే మరోవైపు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు సామాజిక వర్గాల లెక్కలు.. అటు ఆర్థిక బలం లెక్కలు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వివాదాస్పద నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వివాదాల్లో నిలిచిన వ్యక్తులతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న వారికి టికెట్ నిరాకరించారు. హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్‌కు ఈసారి సీటు ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. పోలీసు అధికారిగా పనిచేసిన మాధవ్ గత ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వెంటనే హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.
పార్టీ పరువు తీసిన వీడియో..
తొలి నుంచి ఆయన వివాదాస్పదంగానే ప్రవర్తిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. ఇది వైసీపీకి తీవ్ర డ్యామేజ్ చేసింది. అంతేకాకుండా ఈసారి ఎమ్మెల్యేఆ పోటీ చేస్తానని తనకు తానుగా ప్రకటించుకోవడం కలకలం రేపింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అధినేత జగన్.. ఇప్పుడు తొక్కిపెట్టేశారు. ఎమ్మెల్యే సీటు కదా ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా సెలైంట్ చేసేశారు. రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన బళ్లారి మాజీ ఎంపీ శాంతమ్మకు హిందూపురం ఎంపీ బాధ్యతలు అప్పగించారు. దీంతో గోరంట్ల మాధవ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్దకరంగా మారింది.
భూకబ్జా ఆరోపణలు..
ఇక మంత్రిగా ఉంటూ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి గుమ్మనూరి జయరాంను సైతం జగన్ పక్కన పెట్టేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించి మంత్రిగా కేబినెట్‌లో స్థానం సంపాదించారు. భూకబ్జాలు, పేకాట శిబిరాలు వంటి ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలిచారు. కార్మికశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఒక మల్టీ నేషనల్ కంపెనీ నుంచి ఖరీదైన కారును గిఫ్ట్‌గా పొందినట్లు కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇవన్నీ మౌనంగా చూస్తూ వచ్చిన జగన్.. సరైన సమయంలో ఆయనకు చెక్ పెట్టారు. కర్నూలు ఎంపీగా ఆయనకు బాధ్యతలు అప్పగించి సైడ్ చేసేశారు.
కోడి గుడ్డు మంత్రిగా ట్రోలింగ్..
అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు టికెట్ కేటాయించలేదు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ స్థానంలో భరత్ కుమార్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. అంతేకాకుండా గుడివాడకు మరోచోటకు కూడా తరలించలేదు. ఐటీశాఖ మంత్రిగా ఉంటున్న ఆయన కోడి గుడ్డు లాంటి వ్యాఖ్యలతో తీవ్రంగా ట్రోల్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చిన ఈ నేతలను పక్కన పెట్టడంపై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి క్యాడర్ మాత్రం నిరసన గళం విప్పుతున్నారు. మరి త్వరలో విడుదల కానున్న మూడో జాబితాలో ఇంకెంతమంది కాంట్రవర్సీ నేతలకు జగన్ చెక్ పెడతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout