CM Jagan:విజయదశమి రోజున విశాఖకు షిఫ్ట్ కానున్న సీఎం జగన్.. ముగ్గురు సభ్యులతో కమిటీ

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్.. అక్కడి నుంచి పరిపాలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం మార్పునకు పనులు చకచక జరిగిపోతున్నాయి. అక్టోబర్ 24న విజయదశమి పండుగ రోజున సీఎం ఆఫీస్ విశాఖకు తరలించనున్నారు. క్యాంప్ కార్యాలయ తుదిదశ నిర్మాణ పనులు వేగవతం చేశారు. క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పరిపాలన రాజధానిగా విశాఖ..

ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రభుత్వ సీనియర్ అధికారులు విశాఖపట్నంలో బస చేయడానికి తగిన వసతిని గుర్తించేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులుగా ఉన్నారు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. దసరా నుంచి విడతల వారిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 16న విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్రారంభం..

మరోవైపు ఈ నెల 16వ తేదీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. రిషికొండ ఐటి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. దీంతో ఆ రోజు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది. విశాఖ పరిసరాల ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులు ఇక ఈ క్యాంపస్ నుంచే పనిచేయనున్నారు. ప్రస్తుతం రిషికొండలో నిర్మిస్తున్న సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో నివసిస్తున్న విషయం విధితమే. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచే ఆయన పరిపాలన సాగిస్తున్నారు.