CM Jagan:ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదంపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని.. మీ భూమిని లిటిగేషన్‌లో ఇరుక్కుంటే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం తెచ్చారని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ చట్టంతో లబ్ధిదారుల పేర్లు మార్చి ఇష్టారీతిన పొలాలు, ఆస్తులు దోచుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై సీఎం జగన్ స్పందించారు.
పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంపై చంద్రబాబు బ్యాచ్ ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. ఈ చట్టంపై ప్రజలందరికీ కాల్స్ చేస్తూ.. మెసేజ్ పెడుతూ భయభ్రాంతాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాగేసుకునే వాడు కాదని స్పష్టం చేశారు.
"వందేళ్ల కిందట బ్రిటీష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు... భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం. భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును నవీకరించి, ఆ వివరాలతో రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే... చేతనైతే మద్దతు పలకాలి కానీ, దుష్ప్రచారం చేయడం తగదు. ఈ సర్వే చేయక ముందు భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా అనేక ఇబ్బందులు ఉండేవి" అని స్పష్టం చేశారు.
కాగా ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇప్పుడు ఈ చట్టం కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించడంతో ప్రజల్లో అయోమయం ఏర్పడింది. ఎన్నికల వేళ ప్రభుత్వ పెద్దలు చేసే ఇలాంటి భిన్నమైన ప్రకటనలతో వైసీపీ తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రజల ఆస్తులకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన చట్టం గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments