CM Jagan:కల్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

ఏపీలో మరో కీలక పథకానికి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు అందజేశారు. అలాగే మైనార్టీ, దూదేకుల, నూర్ భాషా కులస్థులకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.40 వేల చొప్పున నగదు విడుదలైంది. సాయం పొందిన జంటల్లో 8,042 మంది అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద కూడా ప్రయోజనాలు అందుతున్నాయని సీఎం జగన్ తెలిపారు.

ఈ పథకం కింద ఇప్పటివరకూ 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 2022 అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ నాలుగు విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. బాల్యవివాహాలను ఆరికట్టేందుకు టెన్త్ సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టామన్నారు. పదో తరగతి తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని.. ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాయని గుర్తు చేశారు.

అమ్మఒడి పథకం వల్ల పిల్లలను బడికి పంపేలా తల్లులు సిద్ధమతున్నారని.. అలాగే వైఎస్ఆర్ కల్యాణమస్తు నిబంధనల వల్ల ఇంటర్ వరకూ తమ పిల్లలను చదివిస్తారని చెప్పారు. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల గ్రాడ్యుయేట్ వరకూ చదివించేందుకు వెనుకాడరని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పథకం తీసుకొచ్చినట్లు జగన్ వెల్లడించారు.