CM Jagan:సీఎం జగన్ ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షణాల్లో సహాయక చర్యలు..

  • IndiaGlitz, [Tuesday,December 05 2023]

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల్లూరు మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాముందన్న సమాచారంతో జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. NDRF, SDRFతో పాటు అవసరాన్ని బట్టి వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సేవల్ని వినియోగించుకోవాలని ఆదేశించారు.

వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని పేర్కొన్నారు. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసి ఉంటే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. తుఫాన్ తగ్గిన తర్వాత తాను జిల్లాల పర్యటనకు వస్తానని.. సహాయం అందలేదని, తమని అధికారులు బాగా చూసుకోలేదన్న మాట బాధితుల నుంచి వినపడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని.. వారు శిబిరాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, కుటుంబం ఉంటే వారికి రూ.2500ఇవ్వాలని సూచించారు. ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కేజీ చొప్పున అందించాలన్నారు.

సీఎం జగన్ ఆదేశాలతో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు.

బాపట్ల – కాటమనేని భాస్కర్‌
అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి
తూర్పుగోదావరి – వివేక్‌ యాదవ్‌
కాకినాడ – యువరాజ్‌
ప్రకాశం – ప్రద్యుమ్న
ఎస్‌పిఎస్‌ నెల్లూరు – హరికిరణ్‌
తిరుపతి – జె.శ్యామలరావు
పశ్చిమ గోదావరి – కన్నబాబు

దీంతో ఈ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరానికి తుఫాన్ మరింతగా సమీపిస్తుంది. చెన్నైకి 100, నెల్లూరుకు 120, పాండిచ్చేరి 220, బాపట్ల 250, మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు – మచిలీపట్టణం మధ్య బాపట్ల సమీపంలో రేపు(మంగళవారం) ఉదయం తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో అధికారులు తీరప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేశారు.