CM Jagan:'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు సిద్ధమైన సీఎం జగన్.. రూట్ మ్యాప్ ఖరారు..
- IndiaGlitz, [Tuesday,March 19 2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార వైసీపీ ఇక ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి మూడు రోజుల పర్యటన షెడ్యూల్‌ను ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చాక ప్రచార సభలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల సమరానికి కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి ముందుగా బస్సుయాత్ర చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇడుపులపాయలో ప్రారంభం కానున్న ఈ యాత్రలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఉదయం ప్రజలతో జగన్ మమేకమవుతారని.. మధ్యాహ్నం నేతలతో సమావేశాలు.. సాయంత్రం సభ ఉంటుందని వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీ తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలోని ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తామని.. 28వ తేది రెండవ రోజు నంద్యాలలో సభ ఉంటుందన్నారు. ఇక 30వ తేది మూడవ రోజు కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మిగనూరులో సభ ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా తమ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు మళ్లీ ఎందుకు అధికారం అప్పగించాలనే దానిపై ప్రజలకు వివరించనున్నారని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే 'సిద్ధం' పేరుతో నాలుగు సభలను భారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలోని భీమిలి, కోస్తాంధ్రలోని దెందులూరు, మేదరమెట్ల, రాయలసీమలోని రాప్తాడులో ఏర్పాటుచేసిన ఈ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు సీఎం జగన్ అన్ని విధాలా సిద్ధమయ్యారు.