BTech Ravi: నన్ను చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారు: బీటెక్ రవి
Send us your feedback to audioarticles@vaarta.com
తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తన గన్మెన్లను తొలగించారని మండిపడ్డారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా జగన్, భారతి, అవినాశ్ రెడ్డిలదే బాధ్యత అని తెలిపారు. గన్మెన్లను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల మార్పు అంశం గురించి మాట్లాడుతూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తనకు అక్కడి నుంచి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు.
"వైసీపీలో ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలను అటూ ఇటూ, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి మార్చుకుంటున్నారు. ఇది మీ పార్టీ అంతర్గత విషయం కాబట్టి మేం పట్టించుకోం. కానీ సీఎం జగన్‌ను మేం కోరేది ఏంటంటే.. అటూ ఇటూ మార్చుకునే ప్రక్రియలో నిన్ను నువ్వు మార్చుకునేవు.. నువ్వు పులివెందులలో లేకుండా పోతే నా పరిస్థితి ఏంటి? నేనేదో నిన్ను నిమ్ముకుని, నువ్వు పులివెందుల ప్రజలకు చేసిన అన్యాయం, వారి పట్ల నీ నిర్లక్ష్యం, పులివెందుల ప్రజలను నువ్వు అగౌరవపరిచిన విధానం... వీటన్నింటి నేపథ్యంలో నీపై నేను పోటీ చేస్తుంటే నువ్వు పులివెందుల నుంచి వెళ్లిపోతే నా గతేం కాను? అందుకే, నీ సీటునైనా నువ్వు మార్చుకోకుండా ఉండు అని ముఖ్యమంత్రిని కోరుతున్నాం" అని నవ్వులూ పూయించారు.
అలాగే "మా అధినేత చంద్రబాబుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. ఒకవేళ జగన్.. పులివెందులను విడిచి వెళ్లిపోతే ఆయన ఎక్కడ పోటీ చేస్తే నన్ను కూడా అక్కడికి పంపించాలని కోరుతున్నా" అని పేర్కొన్నారు.
కాగా ఇటీవల బీటెక్ రవిని పోలీసులు రాత్రి పూట అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మప్టీలో ఉన్న పోలీసులు తమ వాహనాల్లో రెండుగంటలు ఎక్కడెక్కడో తిప్పడం సంచలనం రేపింది. తొలుత వల్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు.. అక్కడ్నుంచి నేరుగా కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో తనను చంపేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు పోలీసులతో బీటెక్ రవి దురుసుగా ప్రవర్తించారని కేసు పెట్టారు. ఈ కేసు పెట్టిన పది నెలలు తర్వాత అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments