Pemmasani:పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: పెమ్మసాని
- IndiaGlitz, [Saturday,April 20 2024]
పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వడం లేదని.. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుమించిన పథకాలు అందజేశారని తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగం ద్వారా నెలకి రూ.30వేలు సంపాదించగలిగే అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చూపిస్తారని.. అదే ప్రజలు సమస్యలతో తల్లడిపోతున్నా సరే జగన్ కనీసం కన్నెత్తి చూడరని విమర్శించారు. ఇదే ఇద్దరు నాయకులకు ఉన్న తేడా అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని ఎవరు అరికట్టగలరు ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
అలాగే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు సమయానికి కేటాయించుకుని మరీ 72% పనులు పూర్తి చేయించారని గుర్తుచేశారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్లు మార్చడం, బిల్లులు ఆపేయడం వంటి పనుల వల్ల పోలవరం అర్ధాంతరంగా నిలిచిపోయిందని వాపోయారు. మరో నెలలో కూటమి ప్రభుత్వం వస్తుందని.. పోలవరం నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. సమాజంలో ప్రజలను సమతుల్యంగా ముందుకు నడిపించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని... ఆయన నాయకత్వంలో ఢిల్లీలోని ప్రతి గల్లీ తిరిగైనా సరే నిధులు సమీకరించి అభివృద్ధి చేయగల సమర్థత సామర్థ్యం తనకు ఉన్నాయని వివరించారు. కాకుమాను గ్రామంలో స్థానికుల కోరిక మేరకు అడిగిన ఆర్వో ప్లాంట్ పై అంశంపై మాట్లాడుతూ ఎన్నికల వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రజలందరూ ఓటు వేయాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు.