CM Jagan:కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఫైర్..

  • IndiaGlitz, [Thursday,March 07 2024]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని విమర్శించారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 26లక్షల 98వేల 931 మంది లబ్దిదారుల ఖతాల్లో బటన్ నొక్కి రూ.5060.49 కోట్లు జమచేశారు. ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. నాలుగు విడతల్లో కలిపి ఒక్కొక్కరికి మొత్తం రూ.75వేలు ఆర్థికసాయం అందించింది.

ఈ స్కీమ్ కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ద్వారా ఒక్కో మహిళకు రూ.75వేలు ఇచ్చామన్నారు. పథకం అమలులో ఎక్కడా లంచాలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా మొత్తం 33 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధిపొందారని చెప్పారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఏనాడైనా ఈవిధంగా ప్రజలకు మేలు చేశారా..? అని ప్రశ్నించారు. బాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలే గుర్తుకు వస్తాయి. 2014లో ఇచ్చిన ఒక్క వాగ్ధానమైనా అమలు చేశారా? మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయనను నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే అని విమర్శించారు. ఇక దత్తపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని.. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి నేతలు వచ్చే ఎన్నికల్లో కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేస్తారన్నారు. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే అని.. మీ బిడ్డ మీకు మంచి చేశానని నమ్మితే తనకు ఓటు వేయండని విజ్ఞప్తి చేశారు.