తన కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: సీఎం జగన్

  • IndiaGlitz, [Wednesday,January 24 2024]

ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల అధ్యక్షురాలు కావడంపై సీఎం జగన్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయం చేస్తోందని తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న జగన్‌ పలు అంశాలపై మాట్లాడారు. గతంలో తన బాబాయ్‌ను మంత్రిని చేసి తనపై ప్రయోగించిందని.. ఇప్పుడు మరోసారి సోదరి షర్మిలను తన పైకి ప్రయోగించిందని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిందని.. చరిత్ర నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. ఆ దేవుడే వారికి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

అలాగే ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదని స్పష్టంచేశారు. టీడీపీ, జనసేన కూటమితోనే తమకి పోటీ అని.. కాంగ్రెస్ పార్టీతో కాదన్నారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం లేదని.. సీఐడీ అధికారులు వారి పని వారు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీలో బలం లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నట్లు వివరించారు. తన వల్ల ప్రజలకు మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ధైర్యంగా అడుగుతున్నానని చెప్పుకొచ్చారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన 99.5 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు.

రాష్ట్రంలో పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో పేదల పిల్లలకు తెలుగు మీడియంలో.. ధనికుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పేద పిల్లలకు సైతం ఇంగ్లీష్ విద్యను చేరువ చేసినట్లు తెలిపారు. అలాగే నాడు-నేడు పథకం తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులందరికీ టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ట్యాబ్ అందించామని సీఎం వివరించారు. ఇలా పలు అంశాలపై తన స్పందన తెలియజేశారు.

కాగా ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమతులైన షర్మిల ప్రభుత్వం తీరుపై షర్మిల తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేసింది ఎక్కడా..? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా..? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా..? మీరు నడుపుతున్న మెట్రో ఎక్కడా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి సొంత అన్నాచెల్లె మధ్య రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి.