CM Jagan:చంద్రబాబు పాలనంతా అవినీతి మయం.. సీఎం జగన్ తీవ్ర విమర్శలు
- IndiaGlitz, [Thursday,October 19 2023]
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు పాలన మొత్తం అవినీతి కుంభకోణాల మయం అని విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీల నుంచి అమరావతి భూముల వరకు అవినీతి చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్, అమరావతి, విద్యుత్ కొనుగోలు అన్నింటిలో కూడా అడ్డగోలుగా దోచేశారని ఆరోపణలు చేశారు.
మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే..
రాష్ట్రం మారలేదు.. బడ్జెట్ మారలేదు.. అప్పుడూ ఇప్పుడు ఒకటే బడ్జెట్.. కానీ మారింది మాత్రం ముఖ్యమంత్రేనన్నారు. అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని.. ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు పడుతోందని వివరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు.
రూ.2లక్షల కోట్లకు పైగా నగదును ఖాతాల్లో..
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. వాళ్లకు రావాల్సిన సున్నా వడ్డి వెసులుబాటును కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పొదుపు సంఘాలను డీఫాల్టర్‌లను చేస్తే.. తాను వారిని లక్షాధికారులు చేస్తున్నానని చెప్పారు. బటన్ నొక్కి రూ.2లక్షల కోట్లకు పైగా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నాలుగన్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళలకు ఇచ్చామని జగన్ వెల్లడించారు.