బోటు ప్రమాద బాధితులను చూసి జగన్ భావోద్వేగం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏరియల్ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరిన సీఎం ముందుగా గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను సీఎం పరామర్శించారు.
లాంచీ ప్రమాదంపై విచారణకు ఆదేశం
లాంచీ ప్రమాద ఘటనపై జగన్ విచారణకు ఆదేశించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన.. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. లాంచీ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సమయంలో గోదావరిలోకి లాంచీ అనుమతి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీలను సభ్యులుగా చేర్చారు. మూడు వారాల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చాలా బాధ కలిగింది!
ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సమయంలో వారు చెబుతున్న మాటలు విని చాలా బాధ కలిగిందన్నారు. ఈ సందర్భంగా లాంచీ ప్రమాదం ఎలా జరిగింది..? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆయన ఆరా తీశారు. ఇందుకు స్పందించిన అధికారులు గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రతి నెలా ఫిట్‌నెస్!
‘లాంచీలకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. బోట్ల పరిస్థితి ఏంటీ..? ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారా..? వారం రోజుల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్ ఏర్పాటులో పోలీసు, ఇరిగేషన్, టూరిజం విభాగాలను భాగస్వామ్యం చేయాలి. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్ అధికారులు గుర్తించాలి. ప్రతి నెలా ఫిట్‌నెస్ తనిఖీలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని పర్యాటక బోట్ల స్థితిగతులపై సమీక్ష జరపాలి’ అని ఈ సందర్భంగా అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments