CM Jagan:రాజకీయ కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయలేదు.. సీఎం జగన్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చెయ్యలేదని.. ఆయనపై తనకు ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తెలిపారు. అరెస్టు జరిగినప్పుడు తాను లండన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో దొరక్కుండా ఆనాడు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు జీవో ఇచ్చారన్నారు. కేసులో ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కి పంపిందని స్పష్టం చేశారు. . చంద్రబాబు ప్రజల్లో ఉన్నా.. జైలులో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు వస్తాయని.. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన వివరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని.. దేశంలో మరే ఇతర పార్టీ కూడా ఇన్ని హామీలు అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇంత మంచి చేసిన మనకి 175కి 175 సాధ్యమే అంటూ ధీమా వ్యక్తం చేశారు
15 ఏళ్లు అయినా జనసేనకు జెండా మోసే కార్యకర్తలు లేరు..
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన పార్టీ 15 ఏళ్లు అయింది.. ఇంతవరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని సెటైర్లు వేశారు. కనీసం జెండా మోసే కార్యకర్తలు కూడా లేరన్నారు. టీడీపీ-జనసేన పొత్తు గురించి మట్లాడుతూ రెండు సున్నాలు కలిసినా నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నా అంటూ ఎద్దేవా చేశారు. చనిపోయాక కూడా ప్రతీ ఇంట్లో తన ఫోటో ఉండాలని అలాంటి రాజకీయాలే చేస్తానన్నారు. జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడని.. ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాడని తెలిపారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అదే కొలమానంగా చూడాలని కోరారు.
అక్టోబరు 25 నుంచి డిసెంబరు 5 వరకు బస్సు యాత్ర..
ఇక అక్టోబరు 25 నుంచి డిసెంబరు 5 వరకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ప్రతి బస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఉంటారన్నారు. 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని.. పేదలంతా ఏకమైతేనే పెత్తందారులను ఎదుర్కొంటామన్నారు. కోటి 60 లక్షల ఇళ్లకు వై ఏపీ నీడ్స్ జగన్ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలో చేప్పేందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. మొత్తానికి విస్తృతస్తాయి సమావేశం ద్వారా వైసీపీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు జగన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments