రాజధానిపై ఒక్క మాటలో తేల్చేసిన సీఎం వైఎస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధానిపై గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న అనగా మంగళవారం నాడు రాజధాని రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ చాలా క్లారిటీగా క్యాపిటల్‌గా మాట్లాడారు. ఇవాళ విజయవాడలో జరిగిన ‘ది హిందు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా.. ఇంగ్లీష్ మీడియం, రాజధాని వ్యవహారంతో పలు విషయాలపై నిశితంగా వివరించారు.
నేను నిర్ణయం తీసుకోకుంటే..!
‘ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. రాజధానిపై ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది’ అని జగన్ ఒక్క మాటలో తేల్చేశారు.
ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కనీస అవసరం!
‘బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మనదేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదు. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కనీస అవసరం. ఇంటర్‌నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. ఇవాళ మనం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడు. తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూల్‌కి పంపగలమా..!?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియంలో ఎందుకు చదవాలి..?. 98.5 శాతం ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెబుతున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకుంటారు’ అని జగన్ ఈ సందర్భంగా తెలిపారు.
మొత్తం మార్చే ప్రయత్నాలు చేస్తున్నాం!
‘మేం కేవలం ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు. మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని మాకు తెలుసు. ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫోటోలు తీసి వచ్చే మూడేళ్లలో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం’ అని జగన్ స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తే రాజధానిపై నెలకొన్న అనుమానాలపై తాజాగా జగన్ స్పష్టత అయితే ఇచ్చేశారు. మరి ఇకపై రాజధాని రైతుల ఆందోళనలు, టీడీపీ నేతల పరిస్థేతేంటి..? వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు..? మరీ ముఖ్యంగా చంద్రబాబు ఎలా స్పందిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout