CM Jagan:ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర..
- IndiaGlitz, [Wednesday,March 27 2024]
ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్ దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 'సిద్ధం' సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించడమే కాకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఎలా ఉంటుందో చూపిస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికలకు తాము కూడా 'సిద్ధం' అనేలా కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు పార్టీ అధినేత జగన్ ప్రణాళికలు రూపొందించారు.
ఇందులో భాగంగా మర్చి 27న వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆ తరువాత వేంపల్లె, విఎన్ పల్లె, పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బసచేస్తారు. తొలి రోజు మొత్తంగా 115 కిలోమీటర్ల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది.
ఈ బస్సు యాత్రలో భాగంగా కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతారు. వారితో ముచ్చటించి ప్రభుత్వ పాలనా గురించి వారి అభిప్రాయాలూ తెలుసుకుంటారు. ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్ జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తుండడం పట్ల క్యాడర్‌తో పాటు జనంలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తమ అభిమాన నాయకుడిని కలవాలని, మాట్లాడాలని ఫోటోలు దిగాలని ఎదురుచూస్తున్నారు.
అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ఎంతో మంది ఇప్పుడు తమ ఆత్మీయ నాయకుడిని కలిసేందుకు ఈ యాత్ర ఒక గొప్ప వేదిక కానుంది. ఈ నేపథ్యంలో 'సిద్ధం' సభలను మించి ఈ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ బస్సు యాత్ర సైతం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం అవుతుందని.. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి తోడ్పడుతుందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.