Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ భరోసా.. రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేక ప్రమాదమా..? అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ వెల్లడించారు.
"సోదరి గీతాంజలి విషాద ఘటనను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. చలించిపోయిన ముఖ్యమంత్రిగారు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. తల్లిలేని లోటును తీర్చలేకపోయినా, ఆ పసిబిడ్డల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. స్పందించి అండగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు" అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు ఆమె మరణంపై ఆయన మరో ట్వీట్ చేశారు. "ఆ అమాయకపు పసి బిడ్డలను చూస్తే చాలా బాధేస్తోంది. ప్రాణం కన్నా ప్రేమించే కన్న బిడ్డల్ని అనాథలను చేసి, పేగుబంధాన్ని తెంచుకుని ఆ తల్లి వెళ్ళిపోయిందీ అంటే, ఆమె పడ్డ మానసిక క్షోభ భరించలేనిది. పగవాడికి కూడా ఆ కష్టం రావద్దు. ఆ పిల్లలను ఆదుకోవడమే నివాళి. ఈ విషాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాం" అని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలికి ఇటీవలే ప్రభుత్వం తరపున ఇంటిస్థలం పట్టా మంజూరు అయింది. పట్టాను స్థానిక ఎమ్మెల్యే చేతినుంచి అందుకున్న గీతాంజలి సంతోషంతో మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ, జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోలింగ్ చేయడం వల్ల మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన మాత్రం ఆమె వీడియో వైరల్ కాక ముందే ప్రమాదానికి గురైందని ఆరోపిస్తు్న్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగింది..? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com