CM Jagan and Sharmila:తల్లి విజయమ్మకు సీఎం జగన్, షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Friday,April 19 2024]

ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల భావోద్వేగంతో విజయలక్ష్మికి విషెస్ చెప్పారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం విజయలక్ష్మి రాజకీయాలకు దూరంగా అమెరికా పర్యటనలో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో కలిసి ఉన్న వైఎస్ కటుంబం ఆ తర్వాత రెండుగా చీలిపోయింది. అన్న జగన్‌తో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమెకే విజయమ్మగా అండగా నిలిచారు. అక్కడ షర్మిల చేసిన పోరాటాల్లో తాను కూడా పాల్గొన్నారు. షర్మిలను అరెస్టు చేసినప్పుడు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు కుమారుడు ఏపీలో, కుమార్తె తెలంగాణలో రాజకీయాలు చేస్తారని.. ఇది దైవ సంకల్పమని తెలిపారు. అందుకే కుమార్తెకు అండగా ఉండటానికే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంతేకాకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసును ప్రజల్లోకి తీసుకెళ్తూ జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అటు వివేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

దీంతో ఓవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ప్రత్యర్థులుగా తలపడుతున్న ఈ సమయంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది. అయితే ఆమె మాత్రం ఊహించని విధంగా రాజకీయాలకు దూరంగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం షర్మిల కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.