Purandeshwari:సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సీజేఐకి పురందేశ్వరి లేఖ..
- IndiaGlitz, [Saturday,November 04 2023]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ నేతల మధ్య రోజురోజుకు రాజకీయ దుమారం రేగుతోంది. పురందేశ్వరి టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఆమె కూడా అదే స్థాయిలో వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మద్యం సరఫరా కంపెనీల వెనక విజయసాయి రెడ్డి ఉన్నారని ఆధారాలతో సహా చూపించారు. దీంతో విజయసాయిరెడ్డి, పురందేశ్వరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి లేఖ రాశారు పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్, విజయసాయి రెడ్డి పదేళ్లకు పైగా బెయిల్‌పై ఉన్నారని.. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా పదే పదే వాయిదాలతో అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.
అలాగే విజయసాయి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో కడప గూండాలతో విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఫిర్యాదుచేశారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొ్న్నారు. ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని పురందేశ్వరి లేఖలో తెలిపారు. తక్షణమే వీరిద్దరి బెయిల్ రద్దు చేయాలని సీజేఐని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖతో పాటు ఐదు పత్రాలను జతచేశారు. ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఆమె లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.