క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.. ఆరుగురి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్
- IndiaGlitz, [Wednesday,July 15 2020]
కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేశాలన్నీ వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రష్యా ఓ అడుగు ముందుకేసి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగా.. ఇండియా తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారత్ బయోటెక్ - ఐసీఎంఆర్‌లు సంయుక్తంగా చేపట్టిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు మార్గం సుగమం అయింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్.. దేశంలోని 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. ఆ అవకాశం తెలంగాణలో నిమ్స్‌కు దక్కింది. కొద్ది రోజులుగా నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం.. క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్లను ఎంపిక చేసే పనిలో పడింది. ఆ వలంటీర్ల కోసం ఇప్పటికే నిమ్స్‌లో ఒక ప్రత్యేక ఐసీయూ వార్డును సైతం ఏర్పాటు చేశారు.
కాగా.. మంగళవారం క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ఆరుగురు వ్యక్తులు ముందుకు వచ్చారు. వారి నుంచి వైద్యులు రక్త నమూనాలను స్వీకరించి ఐసీఎంఆర్‌కు పంపారు. ఆ నమూనాలను పరిశీలించి ఐసీఎంఆర్ నివేదిక పంపిన అనంతరం.. వారిలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిపై మొదట ఒక డోసు వ్యాక్సిన్ ఇస్తారు. వీరు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించుకున్నాక ఇంటికి పంపిస్తారు. పంపించిన అనంతరం కూడా రెండు వారాల వరకూ వైద్యులు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు. మొత్తంగా ఈ క్లినికల్ ట్రయల్స్ 60 మంది అవసరమవుతారని నిమ్స్ వైద్యులు అంచనా వేస్తున్నారు.