నిలిచిపోయిన మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

  • IndiaGlitz, [Tuesday,October 13 2020]

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. జాన్సన్‌ అండ్ జాన్సన్ సంస్థ చేపట్టిన కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉండగా బ్రేక్ పడటం ఆందోళనకు గురి చేస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌ అనారోగ్యం పాలయ్యారు. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సోమవారం ప్రకటించింది.

వ్యాక్సిన్‌ను తీసుకున్న వలంటీర్‌లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తినట్టు సమాచారం. దీనికి గల కారణాలను విశ్లేషించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ క్లినికల్ ట్రయల్స్‌ను అర్థాంతరంగా నిలిపివేసింది. కాగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంస్థల్లో జాన్సన్ అండ్ జాన్సన్ ఒకటి కావడం విశేషం. ఈ వ్యాక్సిన్ తొలి రెండు దశల్లో సత్ఫలితాలను ఇచ్చినట్టు సంస్థ తెలిపింది. మూడో దశలో భాగంగా 60 వేల మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే ఓ వలంటీర్‌కు అంతు చిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో భద్రతా ప్రమాణాల రీత్యా క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. దీనిపై ‘ఇండిపెండెంట్ పేషెంట్ సేఫ్టీ కమిటీ’ లోతైన అధ్యయనం చేయనున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వెల్లడించింది. దీనిపై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్ ఇటువంటివి సహజమేనన్నారు. అనారోగ్యానికి మూలం ఔషధమా లేదా మరేదైనా కారణమా తెలుసుకునేందుకు అధ్యయానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.