భార్య కోసం కొబ్బరి చెట్టెక్కాడు..

  • IndiaGlitz, [Friday,December 18 2020]

కొన్ని పరిస్థితులు ఆ సమయానికి కంగారు పుట్టించినప్పటికీ తరువాత మాత్రం ఫన్నీగా మారిపోతుంటాయి. అలాంటి ఘటనే కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాలో జరిగింది. సహజంగా తన భర్త తనను తీసుకెళ్లడం లేదని భార్య వెళ్లి అతని ఇంటి ముందు ఆందోళనకు దిగడం చూసే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. భర్తే ఆందోళనకు దిగాడు. అయితే భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగాడనుకుంటే తప్పులో కాలేసినట్టే. అతని తన ఊరులోనే ఆందోళనకు దిగాడు.

ఫన్నీ విషయం ఏంటంటే.. భార్య పుట్టింటి నుంచి రాకపోతే భర్త.. ఆమె పుట్టింటి వారిని నిందించడం సహజం. కానీ ఇక్కడ భర్త మాత్రం ఊరి వాళ్లను నిందించాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోతే తనను, తన భార్యను ఏకం చేయడంలో విఫలమయ్యారంటూ ఊరి జనంపై దుమ్మెత్తి పోశాడు. ఆ వ్యక్తి పేరు దొడ్డప్ప. వయసు 40 ఏళ్లు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన భార్య ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. వీరికి ముగ్గురు కుమారులు.

తన భార్య లేకుండా ఇంటినీ, ముగ్గురు కుమారులను చూసుకోవడం కష్టమవుతోందని.. కాబట్టి తన భార్యను, తనను కలపాలంటూ కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి ఊరి జనంపై మాటల తూటాలు పేల్చడం స్టార్ట్ చేశాడు. తనను, తన భార్యను కలపడంలో విఫలమయ్యారంటూ ఊరి జనంపై విరుచుకుపడ్డాడు. తామిద్దరినీ కలిపితేనే కొబ్బరి చెట్టు దిగుతానని భీష్మించాడు. ఏకంగా 8 గంటల పాటు కొబ్బరి చెట్టుపైనే గడిపాడు. చివరకు ఊరి జనం.. దొడ్డప్ప భార్యతో మాట్లాడి ఎలాగోలా ఇద్దరినీ కలుపుతామని హామీ ఇవ్వడంతో చెట్టుపై నుంచి కిందకు దిగాడు.