Hyderabad:మన హైదరాబాదేనా.. ఇలా మండిపోతోందేంటీ, ఏది నాటి వాతావరణం ..?
- IndiaGlitz, [Monday,April 17 2023]
హైదరాబాద్.. ఈ పేరు వినగానే చార్మినార్, బిర్లా మందిర్ , హైటెక్ సిటీ, గొల్కొండ కోట, హుస్సేన్ సాగర్‌లు టక్కున గుర్తొస్తాయి. అంతేకాదు.. చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణానికి భాగ్యనగరం పెట్టింది పేరు. అందుకే దక్షిణ భారతదేశంలో రాష్ట్రపతి తాను విడిది చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. చారిత్రక , సాంస్కృతి రాజధానిగా , మినీ ఇండియాగా పేరొందిన భాగ్యనగరం ఈ స్థాయిలో విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం కూడా కారణం. మండు వేసవిలో సైతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఇక సాయంకాలం వాతావరణం మరింత ఆహ్లాదకరంగా వుంటుంది. అందుకే హైదరాబాద్ నివాస యోగ్యమైన నగరాల్లో చోటు దక్కించుకుంది.
భాగ్యనగరంలో మాయమవుతున్న నాటి వాతావరణం:
అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కపోత, భారీ ఉష్ణోగ్రతలు, వేడిగాలులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతుండటంతో పాటు రాత్రి 8, 9 కావొస్తున్నా వేడి తగ్గడం లేదు. అక్కడక్కడా వర్షం పడుతున్నా.. తర్వాతి రోజు షరా మామూలే. హైదరాబాద్‌లో గడిచిన దశాబ్ధకాలంలో 2016లో అత్యధికంగా.. 2021లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలుష్యం కారణంగానే హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గతంలో మాదిరి హైదరాబాద్‌లో పచ్చదనం కనిపించడం లేదు. నగరం కాంక్రీట్ జంగిల్‌లా మారిపోయింది. పార్కులు , చెరువులు కనుమరుగై వాటి స్థానంలో భారీ అపార్ట్‌మెంట్‌లు, ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో కాలుష్యం పెరిగి.. అంతిమంగా ఇది హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది.
హైదరాబాద్‌లో వడగండ్ల వాన :
ఇకపోతే.. హైదరాబాద్‌లో సోమవారం పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. నాంపల్లి, చంచల్‌గూడ, సైదాబాద్, చంపాపేట, గోషామహల్, బేగంబజార్, బహదూర్‌పురా, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లబర్టీ, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అయితే వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు .. తాజా వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు.. రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.