AP Election Schedule:ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై క్లారిటీ.. అప్పుడే పోలింగ్..!
- IndiaGlitz, [Tuesday,February 20 2024]
లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోనూ కేంద్ర ఎన్నికల బృందం(Central Elections Commission) పర్యటించింది. ఇదే సమయంలో తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. దేశంలో మొత్తం 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తేల్చింది. మరోవైపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కలెక్టర్లతో భేటీ అయింది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ పూర్తిస్థాయిలో కసరత్తును పూర్తి చేసింది. ఇటీవల ఒడిశాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్(Rajiv kumar) ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయినట్లు అయినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు ఈ ఏడాది మే నెలతో ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చించనున్నారని సమాచారం. అనంతరం మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం అక్కడ పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. ఆ తర్వాత మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
కాగా 2019 ఎన్నికల సమయంలో మార్చి 10వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. తొలి దశలో ఏపీతో పాటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. అలాగే ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.