సర్జికల్ స్ట్రైక్స్ వీడియోస్‌‌పై క్లారిటీ వచ్చేసింది..

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

పాక్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌‌లో ఉగ్రవాదుల స్థావరం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 300మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని ఎయిర్‌ఫోర్స్ చెబుతుండగా.. పాక్ మాత్రం అబ్బే అస్సలు లేదు అవన్నీ ఒట్టి మాటలే అని చెబుతోంది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలో నెట్టింట్లో వైరల్ అయిన విషయం విదితమే. అయితే ఆ వీడియోలను నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో నిజంగా వాయుసేన గురి తప్పకుండా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తున్నట్లు.. ఉగ్రమూకలు పరుగులు తీస్తున్నట్లు ఉండటంతో అందరూ ఇదే నిజమైన వీడియో అనుకున్నారు. అయితే అది గేమ్‌‌కు సంబంధించిన వీడియో అని కొందరు.. మరికొందరు అదెప్పుడో అమెరికాలో ఓ దేశంపై యుద్ధానికి సంబంధించిన వీడియో అని తెలిసింది.

అసలు ఆ వీడియోలు నిజామా..? కాదా అనేది సర్జికల్ స్ట్రైక్స్‌ జరిగిన రోజంతా తెలియరాలేదు. అయితే చివరికి ఆ వీడియోలు ఫేక్ అని నిపుణులు తేల్చారు. ఇంత వరకూ ఈ దాడికి సంబంధించిన వీడియోలుగానీ కనీసం ఫొటోలు కానీ ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ విడుదల చేయలేదు. దీంతో నెట్టింట్లో హల్‌‌చల్ చేస్తున్న వీడియోలపై ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది. అతి వేగంగా దూసుకెళ్లే మిరాజ్- 2000 విమానాలు అంత నిలకడగా వీడియో తీసే వీలు లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ అసలు కథ..
మరికొందరు ఈ వీడియోలను నిశితంగా పరిశీలించి.. అది ‘ఆర్మ 2’ అనే వీడియో గేమ్‌కు సంబంధించిన వీడియో అని తేల్చేశారు. వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున షేరవుతున్న ఈ వీడియోను ఇన్విడ్ గూగుల్ క్రోమ్‌లోకి అప్‌లోడ్ చేసి ఎనలైజ్ చేయగా.. అదే వీడియోను పోలిన థంబ్‌నైల్ ఫొటో ఒకటి కనిపించిందని దాని ఆధారంగా సెర్చ్ చేయగా ఆ వీడియో ఫేక్ అని 2009లో విడుదలై ‘ఆర్మ 2’ వీడియో గేమ్ నుంచి తీసి చేసినట్లు తేలిపోయింది. సో ప్రస్తుతం నెట్టింట్లో, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు ఫేక్‌‌ అని తేలిపోయిందన్న మాట.