రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం
- IndiaGlitz, [Thursday,September 24 2020]
రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 180 రోజుల క్రితం సిటీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇన్ని రోజుల తరువాత బుధవారం నగర శివారు ప్రాంతాల్లో కొన్ని బస్సులు తిరగగా.. రేపటి నుంచి సిటీలో సైతం తిప్పేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తొలి విడతగా 25 శాతం బస్సులు మాత్రమే తిప్పనున్నారు. పరిస్థితిని బట్టి దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. గ్రేటర్ పరిధిలోని డిపోల్లో మొత్తంగా 3,200 వరకూ సిటీ బస్సులున్నాయి. కాగా బుధవారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని 135 రూట్లలో డిపోకు 10-12 బస్సుల చొప్పున 229 బస్సులు తిరిగాయి.
కరోనా కారణంగా మార్చి 19 నుంచి సిటీ బస్సులతో పాటు దేశ వ్యాప్తంగా బస్సులను నిలిపి వేశారు. కోవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో పాటు సిటీ బస్సుల్లో కోవిడ్ నిబంధనలను పాటించడం కష్టంగా ఉండటంతో ప్రభుత్వం బస్సులను నిలిపి వేసింది. కాగా గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మొత్తం 29 డిపోలున్నాయి. సిటీ బస్సుల ప్రారంభంపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మతో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడినట్లు సమాచారం. వీరిద్దరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
సిటీ బస్సులను ఏ క్షణంలోనైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు కూడా అంతా సిద్ధం చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పూర్తిస్థాయిలో బస్సులును నడిపినా ఇబ్బందులుండవని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో సేవలు కూడా ప్రారంమైన విషయం తెలిసిందే. ఇక రేపటి నుంచి సిటీ బస్సులు కూడా రోడ్డెక్కనున్నాయి.