హైదరాబాద్‌లో థియేటర్లన్నీ మూసివేత!
- IndiaGlitz, [Thursday,March 05 2020]
టాలీవుడ్ పెద్దలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రోజుల పాటు నగరంలోని అన్ని థియేటర్లను బంద్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా పెద్దల భేటీకి ఫిల్మ్ చాంబర్ వేదిక కానుంది. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, నందమూరి బాలయ్యతో పాటు పలువురు పెద్దలు, సీనియర్లు హాజరుకానున్నారని తెలెుస్తోంది.
జనాలు ఎక్కువగా ఉండే చోటికి వెళ్లొద్దు..!
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా హైదరాబాద్‌కూ వచ్చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎప్పుడేం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల జనాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
అధికారిక ప్రకటన!
ఈ క్రమంలో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఎక్కడెక్కడ్నుంచో జనాలు వస్తుంటారు.. పోతుంటారు. జనసందోహం ఎక్కువగా ఉంటుంది గనుక.. ఇలా ఎవరికైనా కరోనా లక్షణాలుంటే త్వరగా వ్యాప్తిచెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమ వంతుగా నివారణ చర్యలు చేపట్టాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే కొన్ని రోజుల పాటు థియేటర్లను మూసివేయాలని ఇవాళ భేటీలో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు.. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మొత్తం అన్ని విషయాలపై అధికారికంగా ప్రకటన కూడా చేస్తారని సమాచారం.
కాగా.. ఈ మీటింగ్‌కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు, పెద్దలకు బుధవారం సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. ఇవాళ భేటీలో పైన చెప్పిన విషయాలతో ఇంకా ఏమేం చర్చిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరోలు, నటీమణులు కరోనాపై ప్రజల్లో ఆందోళనను తొలగిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చెబుతూ ట్వీట్లు పెడుతున్న సంగతి తెలిసిందే.