జార్జిరెడ్డి నిజజీవితానికి సినిమాకు సంబంధం లేదు : తమ్మారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
జార్జి రెడ్డి... మ్యాన్ ఆఫ్ యాక్షన్. జార్జి రెడ్డి....పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్. జార్జి రెడ్డి.... ఓయూలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి చరమగీతం పాడేందుకు చేసిన పోరాటం. కేరళలో పుట్టి పెరిగి .. ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి... గొప్ప నాయకుడుగా ఎదిగాడు జార్జి రెడ్డి. అగ్రకులాలను అణిచివేసి... పేద విద్యార్థులకు అండగా నిలిచాడు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి చరమగీతం పాడేందుకు ప్రయత్నించాడు. కానీ... అవే పాలిటిక్స్ లో చిక్కుకుని 45 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్ మూవీ జార్జిరెడ్డి. దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
అయితే జార్జి రెడ్డి స్నేహితుడైన తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం... జార్జిరెడ్డి నిజజీవత కథకు.. చిత్రానికి అసలు పొంతనే లేదంటున్నారు. జార్జిరెడ్డిని సినిమాలో ఓ రౌడీ షీటర్ లా చూపించారని.. కానీ జార్జిరెడ్డి అనవసర గొడవలకు వెళ్లే వ్యక్తి కాదని తెలిపారు. ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టేవాడని... అవసరం అనుకుంటేనే గొడవలకు వెళ్లే వాడని తెలిపాడు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ ఇచ్చే వాడని తెలిపారు తమ్మారెడ్డి. జార్జిరెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి తన క్లాస్ మేట్ అని చెప్పిన తమ్మారెడ్డి ... తన తమ్ముడి కోసం జార్జిరెడ్డి మా కాలేజీకి వచ్చే వారని తెలిపారు. ఆ క్రమంలోనే తనకు క్లోజ్ అయ్యానని చెప్పారు. అంతే కాదు సినిమాలో చూపించినట్లుగా జార్జిరెడ్డి ఎప్పుడూ హాస్టల్ లో లేడని.. తన తల్లి, చెల్లి, తమ్ముడితో కలిసి బయట అద్దెకు ఉండేవారని చెప్పారు. తనపై నిషేధాజ్ఞలు విధించిన సమయంలో జార్జిరెడ్డి రెండు నెలలు తమ ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. జార్జిరెడ్డి హత్య జరిగిన రోజు మధ్యాహ్నం వరకు తనతోనే ఉన్నానని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ్. తనని లైబ్రరీ దగ్గర దింపేసి వెళ్లిపోయానని... ఆ తర్వాత అతను బయటకు ఎందుకు వెళ్లాడు? ఎలా వెళ్లాడు?
అసలు ఎవరు తీసుకెళ్లారు ? అనేది ఇప్పటికి అర్ధం కాని ప్రశ్నే అన్నారు. కానీ.. జార్జిరెడ్డితో పాటు తన తమ్ముడు సిరిల్ ఉంటే జార్జి తప్పకుండా బ్రతికేవాడని చెప్పారు. సిరిల్ తన అన్న జార్జి మీద ఈగ కూడా వాలనిచ్చే వాడు కాదన్నారు. ఒకవేళ సిరిల్ ఉంటే ఆ అటాక్ జరిగేదే కాదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. కానీ... 45 ఏళ్ల క్రితం జార్జిరెడ్డి హత్య జరిగి ఉండకపోతే... దేశానికి మంచి నాయకుడు మిగిలి ఉండేవాడన్నారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవాడు అన్నారు తమ్మారెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments