జనసేనలో చేరిన సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్
- IndiaGlitz, [Wednesday,January 24 2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేన పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. మరికొంతమంది సీనియర్ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు జనసేనలో చేరారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి కండువా కప్పిన జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటీవల జనసేన తరపున నెల్లూరు జిల్లాలో జరిగిన అంగన్వాడీల ధర్నాకు జానీ మాస్టర్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో వైసీపీలో పనిచేసిన పృథ్వీరాజ్ కూడా కొంతకాలంగా జనసేనకు మద్దతుగా తన గళం విప్పుతున్నారు. ఇప్పుడు అధికారికంగా పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంతకుముందు సీరియల్ నటుడు ఆర్కే నాయుడు, నిర్మాత బన్నీ వాస్ కూడా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈనెల 27న ఆయన పార్టీలో చేరనున్నారని ప్రకటించారు. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం పవన్‌ను కలిశారు. ఇటీవల గూడూరు ఇంచార్జ్‌గా మేరిగ మురళీని వైసీపీ అధిష్టానం నియమించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో వరప్రసాద్ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. కూటమిలో భాగంగా జనసేన తరపున తిరుపతి ఎంపీగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే పవన్ నుంచి ఎలాంటి హామీ మాత్రం రాలేదని సమాచారం.
ఇక ఈనెల 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే వచ్చే నెల 2న మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీలో చేరనుండగా.. క్రికెటర్ అంబటి రాయుడు కూడా గ్లాస్ గుర్తు కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేను 25-40 సీట్లు దక్కే అవకాశం ఉంది. అయితే దొరికిన కొద్ది సీట్లలో అయినా బలమైన నేతలను నిలబెట్టి పార్టీ బలాన్ని పెంచుకోవాలని పవన్ కల్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు.