Lokesh:రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ.. సమయం వృథా చేశారని లోకేశ్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల పాటు లోకేశ్‌ను అధికారులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. హైకోర్టు ఒక్క రోజే విచారించాలని చెప్పినా రెండో రోజు కూడా విచారణకు పిలిచారని.. కానీ అధికారులు అడిగినందుకు రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యానని తెలిపారు. నిన్న 50 ప్రశ్నలు అడిగితే.. ఇవాళ 47 ప్రశ్నలు అడిగారని పేర్కొ్న్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారన్నారు.
భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్స్ చూపించారు..
ఈ కేసులో తనకు, తన కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదన్నారు. ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగితే అధికారులు సమాధానం చెప్పలేదని లోకేశ్ వెల్లడించారు. ఏం లేని కేసులో అనవసరంగా రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని చెప్పుకొచ్చారు. విచారణలో భాగంగా మా అమ్మ నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించారని.. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నించగా సమాధానం రాలేదన్నారు. దీన్ని కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నానని.. అలాగే ఐటీ శాఖకు కూడా లేఖ రాస్తానని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రావాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్ డెవలపర్ ఎవరు? సీడ్ కాపిటల్ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీ సీఆర్డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఎవరు నిర్ణయించారు? అనే ప్రశ్నలు అడిగారని తెలిపారు.
అధికారుల పేర్లు ఎందుకు ఎఫ్ఐఆర్‌లో లేవు..
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారని పునరుద్ఘాటించారు. ఈ కేసులో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారన్నారు. నాటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లంపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. సంతకాలు చేసిన అధికారులను విచారణకు పిలవకుండా పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును 32 రోజులుగా రిమాండ్‌లో ఉంచడం బాధాకరమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు కార్యదర్శిగా ప్రేమచంద్రారెడ్డి వ్యవహరించారని.. ఆయన గుజరాత్ వెళ్లి స్కిల్ ప్రాజెక్టు పరిశీలించి అద్భుతం అని చెప్పారన్నారు. ఈ ప్రాజెక్టును వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని రూ.285 కోట్లను విడుదల చేయండని ఇచ్చారని.. కానీ ఆయన పేరు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేదని లోకేశ్ నిలదీశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments