Download App

Choosi Choodangaane Review

'పెళ్లిచూపులు' నిర్మాతగా రాజ్‌ కందుకూరికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. కంటెంట్‌ బేస్డ్ సినిమాలు తీస్తారనే పేరు తెచ్చుకున్నారు. తాజాగా శేష సింధు రావు అనే దర్శకురాలిని పరిచయం చేసి, సొంత కొడుకును హీరోగా పెట్టి ఆయన తీసిన సినిమా చూసీ చూడంగానే. ఇప్పటికే ట్రైలర్‌తోనూ, పాటలతోనే ఆకట్టుకున్న ఈ మూవీ ఎలా ఉంది? 'ఫ్రమ్‌ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్‌ పెళ్లిచూపులు' అనే ట్యాగ్‌ను నిలబెడుతుందా? లెట్స్ సీ...

కథ:

సిద్ధు (శివ కందుకూరి) తన తల్లిదండ్రులు (పవిత్రా లోకేష్‌, అనీష్‌ కురువిల్ల)కు ఒక్కగానొక్క కొడుకు. సిద్దు బాగా చదువుకుని మంచి పొజిషన్‌లో ఉంటే చూడాలనుకుంటుంది తల్లి. ఆమె బ్యాంక్‌ మేనేజర్‌. సిద్ధు తండ్రి ఇంట్లోనే ఉంటాడు. తల్లికీ, కొడుక్కీ మధ్య ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటిని తండ్రి మధ్యలో ఉండి సర్దుతుంటాడు. జీవితంలో ఏం చేయాలో తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు సిద్ధు. అలాంటి సమయంలో అతన్ని ఇంజినీరింగ్‌లో చేరుస్తుంది తల్లి. అక్కడ అతనికి ఐశ్వర్య (మాళవిక) పరిచయం అవుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. చదువు పూర్తయ్యేలోపు ప్రేమకు కూడా ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ఆఖరి సంవత్సరం పూర్తి చేయకుండా డిస్‌ కంటిన్యూ చేస్తాడు సిద్ధు. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ చేయాలని కలలు కంటాడు. కానీ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడతాడు. ఆ క్రమంలో తన పాత ఫ్రెండ్‌ యోగిని కలుస్తాడు. అతనితో పాటే శ్రుతి (వర్ష)ను కూడా కలుస్తాడు. శ్రుతికి సిద్ధుకీ మధ్య ఏం జరిగింది? వాళ్లిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? ఐశ్వర్యకీ, శ్రుతికీ ఉన్న సంబంధం ఏంటి? వంటివన్నీ ఇందులో ఆసక్తికరమైన అంశాలు.

ప్లస్‌ పాయింట్లు:

- శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ నటన
- పాటలు
- సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
- ఫొటోగ్రఫీ
- ఎమోషన్స్

మైనస్‌ పాయింట్లు:

- సాదాసీదాగా సాగిన ఫస్టాఫ్‌
- ఎడిటింగ్‌
- ఎక్కడా కొత్తదనం లేకపోవడం
- 'హ్యాపీడేస్‌'తో సహా ఇంజినీరింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలను గుర్తుచేయడం

విశ్లేషణ:

కొత్త నటీనటులు, కొత్త దర్శకురాలు.. ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశారనే విషయం అర్థమవుతుంది. చూసీ చూడంగానే టైటిల్‌ ఈ సినిమాకు చాలా యాప్ట్. అప్పుడప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన అబ్బాయికీ, అమ్మాయికీ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? తనను చూసి ఒకరు నచ్చారని చెప్పగానే అబ్బాయి ఎలా ఫీలవుతాడు? మనసు స్థిరంగా లేని అమ్మాయి ఎలాంటి భావనలకు లోనవుతుంది. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించిన అమ్మాయి చెప్పడానికి ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది? మనసుకు నచ్చిన మాట చెప్పలేక, నచ్చిన మనిషిని వదులుకోలేక అమ్మాయి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? వంటి విషయాలన్నీ ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు శేషసింధురావు. అమ్మాయిగా చాలా అంశాలను సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్క్రీన్‌ప్లే కొన్నిచోట్ల చాలా స్లోగా ఉంటుంది. మరికొన్ని చోట్ల అనుకున్నది సూటిగా చెప్పలేకపోయిన ధోరణి కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కనిపించే ఒకట్రెండు హై ఇచ్చే సన్నివేశాలు, అంతకు ముందు ఫస్టాఫ్‌లో కూడా ఉంటే బావుండేది. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. శివ లుక్స్ పరంగా ఓకే, డైలాగ్‌ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకాస్త మెరుగ్గా కనిపించాలి. ఫస్టాఫ్‌ మొత్తం కనిపించిన మాళవిక రూపం ఎందుకో మనసుకు రిజిస్టర్‌ కాదు. వర్ష బొల్లమ్మ పాత్ర బావుంది. యోగి కేరక్టర్‌ చేసినతను సిన్సియర్‌ గా ట్రై చేస్తే టాలీవుడ్‌లో ఫ్యూచర్‌ ఉంటుంది.

బాటమ్‌ లైన్‌: క్లాస్‌గా.. కూల్‌గా... ఎమోషనల్‌గా

Read Choosi Choodangane Review in English

Rating : 2.8 / 5.0