Chiru, Bunny:ఒకే వేదికపై చిరు, బన్నీ, ప్రభాస్.. టీజీ సీఎం రేవంత్ రెడ్డి కూడా..!

  • IndiaGlitz, [Saturday,May 18 2024]

తెలుగు సినీ ప్రేక్షకుల‌కు శుభవార్త. ద‌ర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డే(Directors Day) సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే ఈ సంవ‌త్సరం కూడా మే 4న దాసరి జయంతి సందర్భంగా ఈ వేడుక‌లను నిర్వహించాలని భావించారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల మే 19కి వాయిదా ప‌డింది. ఈ వేడుకకు పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌బోతున్నారు.

హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించ‌నున్నారు. ఈ మేర‌కు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు హాజరుకావాలని అతిర‌థ మ‌హారధుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఇప్పటికే ఈ వేడుక‌కు ముఖ్య అతిథిలుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంక‌టేష్, నేచురల్ స్టార్ నాని ప‌లువురు సినీ ప్రముఖులు హాజ‌రుకానున్నారు. తాజాగా బన్నీ, ప్రభాస్ కూడా వస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ అభిమాన హీరోలను చూసేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు ఈ వేడుకకు విశిష్ట అతిథిగా రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా అసోసియేషన్ సభ్యులు ఆహ్వానం అందించారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని స్వీక‌రించిన సీఎం రేవంత్.. క‌చ్చితంగా వేడుక‌కు హాజ‌రు అవుతాన‌ని చెప్పిన‌ట్లు స‌భ్యులు చెప్పారు. సీఎంకి తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీపై మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని, విజ‌న్ ఉంద‌ని స‌భ్యులు చెప్పారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, రామ్‌గోపాల్ వర్మ త‌దిత‌రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

కాగా ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు చిత్ర సీమ‌లోని ద‌ర్శకులంతా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు. ఓర‌కంగా చెప్పాలంటే ఇది ఇండస్ట్రీ చేస్తున్న అతి పెద్ద వేడుక‌. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు మొద‌ల‌య్యాయి. ఈ కార్యక్రమం ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని ద‌ర్శకుల సంక్షేమం కోసం ఉప‌యోగించనున్నారు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ కూడా ఇలాంటి భారీ వేడుక నిర్వహించే ప్రయ‌త్నాల్లో ఉంది. మొత్తానికి మరోసారి ఇండస్ట్రీ మొత్తం భారీ వేడుకలను నిర్వహించడానికి ముందుకు రావడం శుభపరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు.