చిరంజీవి వర్సెస్ రాజశేఖర్.. అసలేం జరిగింది!?
- IndiaGlitz, [Thursday,January 02 2020]
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ల మధ్య గొడవలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పటికే పలుమార్లు గొడవ జరగడం.. మళ్లీ సారీ చెప్పి వివాదం సద్దుమణగడం ఇవన్నీ షరామామూలైపోయాయి. అయితే తాజాగా మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో భాగంగా ఈ వివాదం మరోసారి చిరు వర్సెస్ రాజశేఖర్‌గా పరిస్థితులు మారాయి. స్టేజ్‌పైనే ఇద్దరు ఒకరిపై ఒకరు ఆగ్రహాశాలకు లోనయ్యారు. అయితే ఇవాళ డైరీ ఆవిష్కరణలో అసలేం జరిగింది..? ఈ వివాదానికి కారకులెవరు..? పక్కా పాన్‌తోనే ఇలా జరిగిందా..? అసలు దీనికి వెనుక ఎవరున్నారు..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింది..!?
కార్యక్రమంలో పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా’ లో ఏవైనా సమస్యలు ఉంటే మనలో మనమే చర్చించుకుందామని.. మంచి ఉంటే అందరికీ వినిపించేలా చెబుదాం అన్నట్లుగా మాట్లాడారు. అయితే పరుచూరి మాటలకు రాజశేఖర్‌కు నచ్చాయో లేదో అసలు అర్థమయ్యాయో లేదో గానీ మధ్యలో కలుగజేసుకుని మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘కలిసి ఉందాం.. కలిసి సాగుదాం.. మంచి ఉంటే మందిలో చెబుదాం. చెడు ఉంటే చెవిలో చెబతాం’ కానీ ఏవేవో చెబుతుంటారు.. మా లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్‌లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని రాజశేఖర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అంతా నా ఇష్టం!
అయితే రాజశేఖర్ మాట్లాడుతుండగా ఆయనకు నచ్చచెప్పేందుకు స్టేజ్‌పై ఉన్న పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ యాంగ్రీ స్టార్ మాత్రం అస్సలు తగ్గలేదు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరో మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ చిరంజీవి ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. రాజశేఖర్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేయగా, వినండి మోహన్ బాబు గారూ, మీరు అరిచేస్తే ఇది జరిగిపోదు అంటూ రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అంతా నా ఇష్టం అన్నట్లుగా ఆయన మొండిగా వ్యవహారించారు. చిరంజీవి మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే.,. ఆయన స్టేజ్‌పై నుంచి ఆగ్రహం ఊగిపోతూ కార్యక్రమం నుంచి బయటికెళ్లిపోయారు.
చెప్పిన మాట విననప్పుడు..!
‘నేను చెప్పిందేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి, నా మాటలకు ఏమైనా విలువ ఇచ్చారా? ఇష్టంలేని వాళ్లు ఇక్కడికి రావడం ఎందుకు?. నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్‌లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి.. నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే. ఎంతో సజావుగా, హృద్యంగా సాగుతున్న సభలో, ఎగ్రసివ్ గా మైక్ లాక్కుని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా, చేయడం మర్యాద కాదు’ అని చిరు హితవు పలికారు. ఇప్పుడు కూడా తాను కోపంతో మాట్లాడే వాడిని కాదని, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా, తనకు కోపం వచ్చేలా చేశారని చిరంజీవి వ్యాఖ్యానించారు.
మళ్లీ వచ్చిన యాంగ్రీ స్టార్!
బయటికి వెళ్లినట్లు వెళ్లిన రాజశేఖర్.. పెద్దలు మాట్లాడుతుండగా మళ్లీ కలుగజేసుకున్నారు. ‘నేను నిజాన్ని మాత్రమే మాట్లాడాను. నేను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోను. నేనెప్పుడు నిజాలు చెప్పే బతుకుతాను.. అబద్ధాలు చెప్పను. ఇష్టం ఉంది కాబట్టే వచ్చాం, కాని వచ్చిన తర్వాత ఇలా జరిగింది. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కల్పించుకోలేదు.. మీరెందుకు మధ్యలో వస్తున్నారు’ అంటూ ఒకింత ఆగ్రహంతో రగిలిపోయారు.
పక్కా ప్రణాళికతోనే ఇదంతా..!
‘ఈ ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి చేయడం.. కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అటువంటి వారికి సమాధానం చెప్పబోను. ‘మా’ లోని క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చిరంజీవి స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తే.. చిరంజీవి-రాజశేఖర్ మధ్య వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలేమీ కనిపించట్లేదు. మరి మున్ముంథు వీరిద్దరి మధ్య గొడవలకు పరిష్కారం మార్గాలు ఎలా వస్తాయో..? ఎవరు రంగంలోకి దిగితే పరిష్కారం అవుతాయో ఏంటో మరి.