అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు..: చిత్తూరు విషాదంపై చిరు ట్వీట్
- IndiaGlitz, [Wednesday,September 02 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకకు సన్నాహాలు చేస్తూ ముగ్గురు జన సైనికులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవన్ కటౌట్ కడుతుండగా.. విద్యుత్ షాక్‌కు గురై సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు జనసైనికులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని.. ఇది మాటలకందని విషాదమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరులో పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసని.. కానీ వారి ప్రాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి సూచించారు. ‘‘చిత్తూరులో పవన్ బర్త్‌డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్‌తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..’’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను’’ అని పవన్ పేర్కొన్నారు.
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2020