ఆగస్టు 25 న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లి గూడెం యస్.వి.ఆర్. సర్కిల్, కె.యన్.రోడ్ లో ఆవిష్కరించనున్నారు. ఈ నెల 25(ఆదివారం)న ఉదయం 10.15 నిమిషాలకు ఎస్వీఆర్ అభిమానుల సమక్షంలో పద్మభూషణుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.
ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం మెగాస్టార్ ప్రత్యేక విమానం లో బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుండి రోడ్ మార్గాన్న తాడేపల్లిగూడెం గం 10.15 ని. కు చేరుకుంటారు
ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జన్మించారు. 18 జూలై 1974లో పరమపదించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో నటించారు. షేక్ స్పియర్ డ్రామాల్లో నటించిన అనుభవంతోనే సినీనటుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయన నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు.
కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఈయన బిరుదులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments