ఏఎన్నార్ జాతీయ అవార్డ్స్: చిరు చేతుల మీదుగా ప్రదానం
- IndiaGlitz, [Thursday,November 14 2019]
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు పేరుతో ‘అక్కినేని అవార్డులు’ ఇవ్వడం మొదలెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం ఆ పరంపరని ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నాగ్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఇలా ప్రతి ఏడాది అవార్డులిస్తున్న నాగ్.. గతేడాది అతిలోక సుందరి శ్రీదేవికి ఏఎన్నార్ జాతీయ పురస్కారం లభించింది. కాగా.. ఈ ఏడాదికి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రేఖను ఈ అవార్డు వరించింది. ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన, ఫొటోలను నాగ్ విడుదల చేశారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. చిరు చేతుల మీదుగానే ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాగా.. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆమె తరపున బోనీకపూర్, జాన్వీకపూర్‌లు ఈ అవార్డు స్వీకరించనున్నారు. ఏఎన్నార్ జ్ఞాపికతో పాటు అవార్డు కింద రూ.5 లక్షల నగదును వారికి చిరు అందజేస్తారు. కాగా.. శ్రీదేవికి అవార్డ్ ఇవ్వాలన్నది ఏఎన్నార్ కోరిక అని నాగ్ పలుమార్లు చెప్పిన విషయం విదితమే.
ఇక రేఖ విషయానికొస్తే.. రేఖతో నాన్నకి మంచి అనుబంధం ఉందన్నారు. మీకు ఈ ఏడాది అవార్డు వచ్చిందని తాను చెప్పగానే తప్పకుండా అవార్డు అందుకోవడానికి వస్తానని రేఖ మాటిచ్చారంటూ నాగ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసిన 70 మంది విద్యార్థులకు పట్టాలు అందివ్వబోతున్నట్లు ఓ ప్రకటనలో నాగ్ తెలిపారు.