Chiranjeevi:చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేస్తాం.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Thursday,January 18 2024]

ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసింది. మరో నెల లేదా రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాలకు గాను 130 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చిరంజీవి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే చిరును ముఖ్యమంత్రిని కూడా చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో మాట్లాడతానని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర విభజనతో అస్థిత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. పునర్‌వైభవం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు తగ్గ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ వారసురాలు వైయస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు. దీంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలందరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిపించుకుని అసెంబ్లీలో తమ వాణి వినిపించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను తిరిగి యాక్టివ్ చేసే పనిలో పడింది.

ఈ క్రమంలోనే మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, వంటి నేతలు కీలకపాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు. వీరితో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆహ్వానం పలికారు. దీంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిని.. మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇటు షర్మిల రాజకీయ వారసత్వం.. అటు చిరంజీవి స్టార్‌డమ్ తోడైతే తిరిగి బలంగా పుంజుకోవచ్చని ప్లాన్ చేస్తోంది. అందుకే చిరంజీవిని సీఎంగా చేస్తామని చింతా మోహన్ వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.