కేసీఆర్, తలసానికి థ్యాంక్స్ చెప్పిన చిరు
- IndiaGlitz, [Tuesday,June 09 2020]
టాలీవుడ్ సినిమా, టీవీ, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ సర్కార్.. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌పై చిరు హర్షం వ్యక్తం చేశారు. ‘వేల మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, విధి విధానాలు రూపొందించి సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు’ అని తన ట్విట్టర్‌లో చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ రూపంలో స్పందిస్తున్నారు.
కాగా.. సోమవారం నాడు కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టీవి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం విదితమే. కాగా.. ఇటీవలే సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మొదట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించిన విషయం విదితమే.
వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020