సినీ థియేటర్లకు జగన్ సహకారం.. ధన్యవాదాలు చెప్పిన చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న దీనికి తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం తన సహకారాన్ని అందించి మరింత కోలుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా.. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేసినట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమాచార పౌరసంబంధాల ఎక్స్ అఫీషియో కార్యదర్శి టి.విజయ్ కుమార్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తదుపరి 6 నెలల కాలానికి కూడా చెల్లించాల్సిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
సినిమా థియేటర్లు జూలై 2020 నుంచి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి సైతం 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటు సినిమా థియేటర్ల యాజమానులు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వడ్డీ రాయితీ వెసులుబాటు మాత్రం మల్టీ ప్లెక్సు థియేటర్లకు ఇవ్వలేదు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ, దీనిపై ఆధారపడిన కార్మికులు, అనుబంధ సంస్థలకు లబ్ది కలిగేలా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఓ స్టెప్ తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. మీరిచ్చిన భరోసా ఎన్నో వేల కుటుంబాలకు హెల్ప్ అవుతుందని చిరు ట్వీట్ చేశారు. ‘‘వైఎస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలను అందజేశారు. మీ సానుభూతితో కూడిన మద్దతు సినీ పరిశ్రమపై ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలకు మద్దతిస్తుంది’’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments