మెగాస్టార్‌కు కరోనా.. రెండు రోజుల క్రితమే సీఎంను కలిసిన చిరు
- IndiaGlitz, [Monday,November 09 2020]
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. నిజానికి నేటి నుంచి 'ఆచార్య' సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ క్రమంలోనే చిరు షూటింగ్లో పాల్గనడానికి ముందుగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే టెస్ట్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చిరు వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
''ఆచార్య' షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
రెండు రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో కనీసం చిరు కానీ.. నాగ్ కానీ చివరకు సీఎం కేసీఆర్ కూడా మాస్క్ ధరించి లేకపోవడం ఫోటోల్లో గమనించవచ్చు. ఈ సందర్భంగా చిరు, నాగ్లు వరద బాధితులను ఆదుకునే నిమిత్తం ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను కేసీఆర్‌కు అందజేశారు. వీరంతా చాలా సమీపంగా మెలగడం కూడా సీఎంను కలిసిన చిత్రాల్లో చూడవచ్చు. అయితే మెగాస్టార్‌కు లక్షణాలేవీ లేకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.