Ram Charan:చిరంజీవి కొడుకు నుంచి గ్లోబల్ స్టార్ వరకు.. రామ్‌చరణ్ సినీ ప్రస్థానం..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న 'గ్యాంగ్‌లీడర్'. చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాలుగా ఏలిన 'శంకర్ దాదా'. అలాంటి లెజెండ్ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'చిరుత' సినిమా ద్వారా 2007లో తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టాడు రామ్‌చరణ్(Ram Charan). తొలి సినిమాతోనే డ్యాన్సులు, ఫైట్స్‌తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులు..
ఇక రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో చేశాడు. 'మగధీర'తో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డును చెరిపేశాడు. డ్యూయల్ రోల్‌లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దీంతో చరణ్ పేరు మార్మోగిపోయింది. అయితే తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అనంతరం 'రచ్చ', 'నాయక్' ఫర్వాలేదనిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్‌లో 'జంజీర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మూవీ డిజాస్టర్ కావడంతో చరణ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత వచ్చిన 'గోవిందుడు అందరివాడులే', 'బ్రూస్‌లీ' సినిమాలు కూడా అభిమానులను నిరాశపరిచాయి.
'రంగస్థలం' మూవీతో విమర్శలకు చెక్..
అంతేకాకుండా చరణ్ నటనపై ట్రోలింగ్ మొదలైంది. చెర్రీ మూస సినిమాలు చేసుకుంటూ నటనతో వైవిధ్యం చూపించడం లేదని పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యాడు. దీంతో తన పంథాను మార్చుకున్నాడు. తానేంటో విమర్శకులకు చూపించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ధ్రువ సినిమాను చేశాడు. ఈ సినిమాలో చెర్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇది సరిపోవడం లేదు. దీంతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' మూవీని చేశాడు. ఇందులో చెవిటి వాడిగా అద్భుతంగా నటించాడు. తన నటనతో ప్రేక్షకులను ఏడిపించాడు. ఆ సినిమా చరణ్ కెరీర్‌లోనే ఒక మైల్ స్టోన్‌గా నిలిచింది.
RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..
ఈ సినిమా ద్వారా తన నటనపై వస్తున్న విమర్శలకు చెర్రీ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్టేజిపై అందరిముందు రంగస్థలంలో చరణ్ నటన గురించి గర్వంగా పొగిడారు. ఇక రాజమౌళి దర్వకత్వంలో RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామరాజు పాత్రలో తన నటనతో మరోసారి అదరగొట్టాడు. ప్రతి సీన్‌లోనూ ప్రేక్షకులని మెప్పించాడు. ఇక క్లైమాక్స్‌లో సీతారామరాజు పాత్రలో అయితే ఆ రాముడే గుర్తొచ్చేలా చేశాడు. ఈ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో 'జంజీర్' మూవీ ఫ్లాప్ ద్వారా ఎవరైతే తనను తీవ్రంగా విమర్శించారో వారి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఎన్టీఆర్‌తో కలిసి 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ ఇరగదీసి ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.
రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి..
అంతలా ప్రపంచ వేదికలపై తనదైన ముద్ర వేశాడు. ఈ మూవీ ద్వారా గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. చరణ్ తర్వాతి సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందంటే ఎంతలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కొడుకైనా సరే ఈ స్థాయి గుర్తింపు రాత్రికి రాత్రే రాలేదు.. దాదాపు 15 ఏళ్ల పాటు కింద మీద పడుతూ.. విమర్శలు ఎదుర్కొంటూ తనను తాను మలుచుకుంటూ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో ఓ కెమెరామెన్ చరణ్‌ను చూపిస్తూ చిరంజీవిని రామ్‌చరణ్ తండ్రి అని చెబుతాడు. ఓ తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం కావాలి. చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ అనే స్థాయి నుంచి రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి చేరుకున్నాడు. మొత్తంగా 'చిరుత' నుంచి RRR వరకు చరణ్ సినీ ప్రయాణం ఎందరికో ఆదర్శం అని చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments