కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. స్పందించిన చిరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు పెట్టిన విషయం తెలిసిందే. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘‘1857 సిపాయి తిరుగుబాటు కన్నా ముందు 1847లోనే పరాయిపాలకులపై రైతుల పక్షాన పోరాటం చేసిన ఉయ్యాలవాడ కర్నూలు గడ్డ పైనే జన్మించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెడుతున్నాం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అన్నారు.

ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెడుతున్నట్టు జగన్ ప్రకటించడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని చిరు పంచుకున్నారు. ‘‘గౌరవనీయులైన సీఎం జగన్ గారు కర్నూలు ఎయిర్‌పోర్టుకు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు ప్రకటించడంతో చాలా సంతోషం వేసింది. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి ఈ రకంగా తగిన గుర్తింపు లభించింది. ఆయన పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిజానికి తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి గాంచారు. ఒకప్పుడు మారుమోగిన ఈ పేరు.. ఆ తరువాతి కాలంలో ఈ పేరు మరుగున పడిపోయింది. ఇటీవల కొన్ని తరాలకైతే ఈ పేరు అసలు తెలియదన్నా ఆశ్చర్యం కాదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ముందుగా ఆయనెవరు? అనే టాక్ మొదలైంది. ఆ తరువాత సినిమా విడుదలయ్యే లోపు జనాలు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అని తెలుసుకున్నారు. దీంతో మరోసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.. ఆయన గొప్పతనం.. తెలుగు వారికి బాగా తెలిసొచ్చింది.