‘మా’ క్రమశిక్షణా సంఘానికి చిరు రాజీనామా?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేశారని తెలుస్తోంది. నరేష్‌ అధ్యక్షతన 2019 మార్చిలో ‘మా’ అసోసియేషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు శివాజీ రాజా వర్గంపై పోటీ చేసి నరేష్ వర్గం విజయం సాధించింది. అయితే ఈ ప్యానల్‌ పాలనా కాలం తాజాగా ముగిసింది. ప్యానెల్‌ ఏర్పాటైనప్పుడు కొంత కాలం బాగానే ఉన్నా, తర్వాత 'మా' ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ రెండుగా విడిపోయారు. అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు వీరి మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు యత్నించినప్పటికీ అవేమీ సాధ్యపడలేదు.

'మా' డైరీ ఆవిష్కరణ సమయంలోనూ.. నరేష్‌, రాజశేఖర్‌ మధ్య అభిప్రాయ బేధాలు మరోసారి బయటపడ్డాయి. ఆ నేపథ్యంలోనే కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధలతో ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం చర్యలు తీసుకోకముందే రాజశేఖర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేశారు. జీవిత మాత్రం కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి రావడం.. ఆ సమయంలో ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సీసీసీ అనే సంస్థను ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు.

కోవిడ్‌ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ‘మా ఎన్నికలకు సైతం సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ 'మా' వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్తలు పలు వెబ్‌సైట్స్, సోషల్ మీడియాలేో వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తపై సినీ ప్రముఖులెవరూ ఇప్పటివరకూ స్పందించలేదు. నిజానికి ‘మా’ ఎన్నికలపై ఎలాంటి ప్రకటనా రాకముందే చిరు రాజీనామా చేశారంటూ వార్తలు.. ఈ వార్తలపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై సినీ ప్రముఖులెవరైనా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.