ఆన్‌లైన్‌లో టికెట్లు మంచిదే.. కానీ ధరల విషయం ఆలోచించండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై చిరు స్పందన
- IndiaGlitz, [Thursday,November 25 2021]
సినిమా టికెట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. టికెట్లకు సంబంధించి పునరాలోచన చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా.. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దీని వల్ల రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేసింది సర్కార్. ఇకపై సినిమా హాళ్లలో నాలుగు షోలు మాత్రమే నడవనున్నాయి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు వుంటుందని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని బిల్లును ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ టికెటింగ్‌పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్కువ రేటుకు సినిమా టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. సినిమా వాళ్లకు ఇబ్బందేమి లేదని.. ఇబ్బందంతా కొన్ని రాజకీయ పార్టీలకేనని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Appeal to Hon’ble @AndhraPradeshCM
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh