శ్రీదేవి చనిపోలేదు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది - చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు. ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు. ఇది దురదృష్టం. అందం అభినయం కలబోసిన నటి శ్రీదేవి. అత్యద్భుత నటి. ఇలాంటి నటి ఇంతవరకు లేరు. ఇకమీద వస్తారని కూడా నేను అనుకోవటం లేదు. నిజంగా భగవంతుడు ఆమెకు చాలా అన్యాయం చేశాడు.
శ్రీదేవి హఠాన్మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పట్నుంచీ శ్రీదేవికి నటన తప్ప మరో వృత్తి లేదు. మరో ద్యాస లేదు, మరో వ్యాపకం లేదు. ఎంత సేపూ నటన నటన అంటూ నటనపై తన అంకిత భావాన్ని తెరమీద చూపింది. ఆమె అంకిత భావం చూసి నేనెంతో నేర్చుకున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అత్యద్భుత దృశ్యకావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమాలో దేవత పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే ఆమెకోసమే ఆ పాత్ర సృష్టించబడిందా.. ఆ పాత్ర కోసమే ఆమె పుట్టిందా అన్నంతగా నటించింది. శ్రీదేవి పాత్ర చూసిన తర్వాత ఎంతగా మెస్మరైజ్ అయిపోయామంటే చెప్పలేంత. ఆ తర్వాత శ్రీదేవితో చేసిన ఆఖరి సినిమా ఎస్పీ పరుశరాం. సినిమా పరంగానే కాకుండా శ్రీదేవి నాకు ఎంతో ఆప్తులు. వారింట్లో ఏదైనా వేడుక జరిగినా, లేదా మా ఇంట్లో ఏదైనా వేడుక జరిగినా ఆత్మీయంగా కలిసి మాట్లాడేవారు. ఆమె మరణ వార్తని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను.
ఆమె మరణ వార్త వినగానే ఒక షాక్‌కి గురయ్యాను. దిగ్బ్రాంతి చెందాను. ఒక గొప్ప నటిని పోగొట్టుకోవడం, మనకు దూరమవడం భారత ప్రజలు, సినీ ప్రజలందరి దురదృష్టమని నేను భావిస్తున్నాను. శ్రీదేవి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆఖరి సారిగా ఒక మాట చెప్పాలని ఉంది. కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న శ్రీదేవి చనిపోయిందని నేను అనుకోవట్లేదు. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో శ్రీదేవి చిరస్థాయిగా జీవించే ఉంటారు. ఈ సినిమా ప్రపంచం ఉన్నంత వరకు శ్రీదేవి బ్రతికే ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout