మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్ చిత్రం 'రారా' తొలి ప్రచారచిత్రం
- IndiaGlitz, [Thursday,February 16 2017]
అన్నయ్య మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు హీరో 'శ్రీకాంత్' వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది. శ్రీకాంత్ కథానాయకునిగా 'రారా' పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విజయ్, శ్రీకాంత్ మిత్రుడు చిత్ర సమర్పకుడు శ్రీమిత్ర చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..' నా తమ్ముడు శ్రీకాంత్, మరో సోదరుడు శ్రీమిత్ర చౌదరి, విజయ్ లు నిర్మాతలుగా రూపొందుతున్నహాస్యభరిత హర్రర్ చిత్రం 'రారా' చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల సందర్భంగా అందరికి శుభాభినందనలు. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను చూడటం జరిగింది. చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఉత్సుకతను కలిగించింది . ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. చిన్న పిల్లలు సైతం ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంబరపడతారు. ఇందులో కథానుగుణంగా ఎన్నో గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసి మరింత ఉత్సుకతకు గురయ్యాను. దెయ్యాలకు మనుషులకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయని ఆశిస్తూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా 'రారా' మోషన్ పోస్టర్ విడుదల అయిన ఆనందంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. అన్నయ్య చేతులమీదుగా గతంలో విడుదల అయి ఘన విజయం సాధించిన 'పెళ్ళిసందడి,ప్రేయసిరావే' వంటి చిత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను.చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
'రారా' చిత్రం షూటింగ్ కార్యరామాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాప్రోక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి, నిర్మాత: విజయ్ , దర్శకత్వం: విజి చరిష్ యూనిట్